Sarath Babu : పోలీస్ అవుదామనుకున్న కలను చిదిమేసిన లోపం .. శరత్ బాబు జీవితంలో ఎత్తుపల్లాలెన్నో..?

News

అలనాటి దిగ్గజ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో సోమవారం కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శరత్ బాబు కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత విషయాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించిన శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. ఆయన కుటుంబం 1950వ దశకంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఆముదాలవలసకు వచ్చి స్థిరపడింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కచెల్లెళ్లు వున్నారు. మగపిల్లల్లో శరత్ బాబు మూడో వారు. సత్యన్నారాయణ దీక్షితులుగా వున్న తన పేరును ఆయన శరత్ బాబుగా మార్చుకున్నారు. దీనికి సినీ విశ్లేషకులు రకరకాల కారణాలు చెబుతారు. కులం పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవడం ఒక కారణమైతే, సుప్రసిద్ధ బెంగాళీ రచయిత శరత్ బాబు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే సత్యంబాబు కాస్తా శరత్ బాబుగా మారిపోయారు.

చదువుల్లో చురుగ్గా వుండే శరత్ బాబుకు చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలన్నది కల. కానీ ఆయన తండ్రి మాత్రం తనను బిడ్డను బిజినెస్‌మెన్‌గా చూడాలనుకున్నారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు శరత్ బాబుకు చూపుకు సంబంధించిన అనారోగ్యం తలెత్తడంతో పోలీస్ అవ్వాలన్న లక్ష్యాన్ని విరమించుకున్నారు. అయితే నిజజీవితంలో పోలీస్ కాలేకపోయిన ఆయన రీల్ లైఫ్‌లో మాత్రం ఎన్నోసార్లు ఖాకీ డ్రెస్ వేసుకున్నారు.

వైట్‌గా, మిల్క్ స్కిన్ టోన్‌తో వుండే శరత్ బాబు చూడటానికి ఎంతో అందంగా వుండేవారు. దీంతో ఇరుగుపొరుగు, స్నేహితులు, కాలేజీలో తోటి విద్యార్ధులు శరత్ బాబును సినిమాల్లో పెద్ద హీరో అవుతాడని అంటుండేవారు. దీంతో ఆయనకు కూడా మనసులో కోరిక మొగ్గ తొడిగింది. ఈ క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని అనుకున్నారు. సినిమాల్లో సక్సెస్ కాలేకపోతే ఇంటికొచ్చి వ్యాపారం చూసుకోవచ్చన్నది శరత్ బాబు ఆలోచన. దీనికి ఆయన తండ్రి ససేమిరా అన్నప్పటికీ, తల్లి మాత్రం బాగా సపోర్ట్ చేశారట. అలా ఓ రోజున కొత్త నటులు కావలెను అని పేపర్‌లో పడటంతో ఆడిషన్‌కు వెళ్లిన ఆయన అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *